రాజకీయాల్లో లాగా చేయకు పవన్

Pawan-Kalyan-Not-Responds-on-Sardaar-Gabbar-singh-Buyers-Issue-Andhra-Talkies
ఆ మధ్య ఒక రాజకీయ సభలో పాచిపోయిన లడ్డూలిచ్చారంటూ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్రం మీద విమర్శలు గుప్పించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఐతే ఎప్పుడో ముగిసిపోయిన అంశాలకు సంబంధించి చాలా ఆలస్యంగా స్పందిస్తూ.. పవన్ కూడా పాచిపోయిన రాజకీయాలు చేస్తున్నాడంటూ ఆయన మీద విమర్శలు కూడా వచ్చాయి. రోహిత్ వేముల మరణం లాంటి కొన్ని సంచలన అంశాలకు సంబంధించి పవన్ చాలా ఆలస్యంగా స్పందించడం తెలిసిందే. ఇలా చాలా రాజకీయ అంశాలపై ముందు మౌనం వహించి.. ఆ తర్వాత చాలా ఆలస్యంగా పవన్ స్పందిస్తున్నాడన్న విమర్శలు అతడిపై ఉన్నాయి. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వివాదంపైనా పవన్ సైలెంటుగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పవన్ కళ్యాణ్ తనకు తెలిసిన వాళ్లెవరికైనా కష్టం అంటే తట్టుకోలేడని.. ఎవరైనా కష్టం అని తన దగ్గరికి వస్తే కచ్చితంగా ఆదుకుంటాడని ఇండస్ట్రీలో ఒక పేరుంది. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వల్ల నష్టపోయిన బయ్యర్ల విషయంపై  మాత్రం పవన్ మౌనం పాటిస్తుండటం ఆశ్చర్యమే. ముందు కృష్ణా జిల్లా బయ్యర్ ప్రెస్ మీట్ పెడితే.. తాజాగా ‘నైజాం’ డిస్ట్రిబ్యూటర్లతో పాటు మరికొందరు వారికి తోడయ్యారు. ‘సర్దార్..’ వల్ల తమకు జరిగిన నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఇంకొందరు బయ్యర్లు వీరికి తోడవ్వచ్చేమో. ఇప్పటిదాకా ఈ వ్యవహారంపై నిర్మాత శరత్ మరార్ కానీ.. మరొకరు కానీ స్పందించనే లేదు. ఇలా మౌనం వహిస్తుంటే తమవైపు తప్పు ఉందని అంగీకరించినట్లే.

వాళ్ల సంగతెలా ఉన్నా.. పవన్ సైలెన్సే చర్చనీయాంశమవుతోంది. బహుశా పవన్ దీని గురించి ఆలోచిస్తుండొచ్చు. తర్వాత స్పందిద్దామని.. సమస్యను పరిష్కరించాలని భావిస్తుండొచ్చు. ఐతే అలా నాన్చుతూ పోతే సమస్య జఠిలమవుతుంది. పవన్ గురించి ప్రతికూల ప్రచారం పెరుగుతుంది. కాబట్టి రాజకీయాల్లో లాగా మీనమేషాలు లెక్కించకుండా.. సాధ్యమైనంత త్వరగా స్పందిస్తే బెటర్. లేకుండా తనవైపు నుంచి వివరణ ఇచ్చే ప్రయత్నం అయినా చేయాలి. లేకుంటే తర్వాత డ్యామేజ్ కంట్రోల్ కష్టమవుతుంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...