సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ సినిమా ముచ్చట్లు!

Sachin A Billion Dreams - Official Trailer -Sachin Tendulkar
సినిమా పేరు: సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌
కథ.. కథనం: జేమ్స్‌ ఎర్స్‌కిన్‌.. శివకుమార్‌ అనంత్‌
సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌
నిర్మాణం: 200నాట్‌ అవుట్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: జేమ్స్‌ ఎర్స్‌కిన్‌
విడుదల తేదీ: 26-05-2017
సచిన్‌ తెందుల్కర్‌ బ్యాట్‌ పట్టుకుంటే చాలు.. బంతులు బౌండరీలు దాటుతాయి. స.... చిన్‌ స.... చిన్‌ సచిన్‌ అంటూ మైదానం గ్యాలరీలోంచి అభిమానుల కేరింతలు అవధులు దాటుతాయి. ఆయన ఆట భవిష్యత్‌ క్రికెటర్లకు పాఠం అయితే అభిమానులకో పండగ. మైదానంలో సచిన్‌ ఆట తీరు.. ఆయన బ్రేక్‌ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. కానీ.. బయటి ప్రపంచానికి ఆయన గురించి తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ తెరపై చూపించే ప్రయత్నమే ‘సచిన్‌- ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ చిత్రం. క్రికెట్‌ దేవుడిగా అభివర్ణించే సచిన్‌ గురించి తెలీని ముచ్చట్లు ఏమిటి? వాటిని ఎంత ఆసక్తికరంగా చెప్పారన్నది చూస్తే..
కథేంటి: ముంబయిలోని ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన తెందుల్కర్‌కి చిన్నతనంలోనే క్రికెట్‌పై ఇష్టం ఏర్పడుతుంది. భారత్‌ 1983లో ప్రపంచకప్‌ సాధించడం ఆయనకు క్రికెట్‌పై మరింత ఇష్టాన్ని పెంచుతుంది. పసిప్రాయంలోనే ముంబయిలోని శివాజీ పార్కులో క్రికెట్‌ ఆడుతూ వేగంగా పరుగులు తీయడం కోచ్‌ అచ్రేకర్‌ గమనిస్తారు. భవిష్యత్‌లో సచిన్‌ గొప్ప క్రికెటర్‌ అవుతాడని నమ్మి ఆయన సచిన్‌కు క్రికెట్‌లో కోచింగ్‌ ఇవ్వడం మొదలుపెడతాడు. అచ్రేకర్‌ శిక్షణతో సచిన్‌ రంజీలో.. భారత క్రికెట్‌ జట్టులో ఎలా స్థానం సంపాదించాడు? భారత క్రికెట్‌ జట్టులోనే కాదు క్రికెట్‌కే దేవుడిగా ఎలా మారాడు? క్రికెట్‌ ప్రపంచంలో సచిన్‌ అంత ఎత్తుకు ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? మ్యాచ్‌ ఫిక్సింగుల వంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీలయ్యారు? 24 ఏళ్ల కెరీర్‌లో తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? తదితర విషయాల కోసం థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎలా ఉందంటే: ‘సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌’ను సినిమా అనే కంటే కూడా దాన్నో ‘డాక్యుమెంటరీ’గా చెబితే సరిపోతుంది. సచిన్‌ గురించి ప్రతి విషయాన్నీ తెరపై చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో సచిన్‌ బాల్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మినహా.. ఎక్కడా ఎవరూ నటించలేదు. ఇన్నాళ్లూ సచిన్‌ గురించి బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఈ చిత్రంలో చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు సచిన్‌ భావోద్వేగాలను కళ్లకు కట్టేలా చూపించారు. సచిన్‌ ఆటను ప్రత్యక్షంగా చూడలేని ప్రతీ దృశ్యాన్ని అభిమానులకు రెండు గంటల్లో చూపించే ప్రయత్నం చేశారు.
1996 వరల్డ్‌కప్‌ నుంచి 2011లో భారత్‌ విశ్వవిజేతగా నిలిచే వరకూ సచిన్‌ జీవితంలో ఎదురైన ప్రతీ విషయాన్ని అప్పటి వీడియోలతో సహా చూపించటం క్రికెట్‌ను అందునా సచిన్‌ అభిమానులకు పండుగ లాంటిదే. 2007 ప్రపంచకప్‌ సమయంలో భారత కోచ్‌ తీసుకున్న నిర్ణయాలపై ఎప్పుడూ స్పందించని సచిన్‌.. తన అభిప్రాయాలను ఈ డాక్యుమెంటరీలో తెలియజేశారు. చెప్పకుండా టీమిండియా కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు ఎలా బాధపడ్డాడో సచిన్‌ వెల్లడించారు.
2011 ప్రపంచకప్‌ సాధించినప్పుడు.. రిటైర్‌మెంట్‌ ప్రకటించినప్పుడు సచిన్‌లోని భావోద్వేగాలను చాలా చక్కగా చూపించారు. సాంకేతికంగా చూస్తే ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సమకూర్చిన నేపథ్య సంగీతం థియేటర్‌ నుంచి బయటకు వచ్చాక కూడా మదిలో నిలిచిపోతుంది. నిజానికి నేపథ్య సంగీతం కారణంగానే సినిమాలో పాటలు లేని లోటు అస్సలు కలుగదు. కొన్ని ఫైల్‌ వీడియోలు రెండుమూడు దశాబ్దాల కిందటివి కావడంతో కొన్నిచోట్ల తెరనిండా కనిపించవు. ఇది కాస్త అసంతృప్తి కలిగించినా.. సుమారు రెండున్నర గంటల్లో సచిన్‌ జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన వైనం ఆకట్టుకుంటుందనే చెప్పాలి.
బలాలు
+ కథ
+ సచిన్‌
చివరిగా.. క్రికెట్‌ దేవుడ్ని వెండితెర మీద నిండుగా చూసుకునేలా చేస్తుంది ‘సచిన్‌..’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Source : http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=reviews&no=182

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...