మార్చ్ 2 నుంచి నో సినిమా-నో ధియేటర్

South-Indian-film-industry-vs-digital-service-providers--No-new-releases-From-March-2nd-Andhra Talkies
సౌత్ లో ఉన్నంత సినిమాల పిచ్చి ఇంకే బాషలోను లేదు అన్నది నిజం. అందులోనూ తెలుగు - తమిళ్ లో అయితే ఇది మరీ ఎక్కువ. కాని కన్నడ - మలయాళంలో మాత్రం అంత ఉదృతి కనిపించదు. అందుకే వాళ్ళ బడ్జెట్ మహా అయితే 10 కోట్లు దాటితే గొప్ప అనుకోవాలి. కాని ఇక్కడ మాత్రం స్టార్ హీరోతో చేసే రెగ్యులర్ కమర్షియల్ సినిమా కూడా కనీసం 60 కోట్ల దాకా ఖర్చవుతుంది. ప్రతి శుక్రవారమే కాక ప్రతి రోజు తెలుగు వాడికి ఉన్న ప్రధాన వినోద సాధనం సినిమానే. అవి బాగున్నా బాలేకున్నా టైం పాస్ కి ఏదో ఒక థియేటర్లోకి వెళ్లి టైం పాస్ చేసే బ్యాచ్ చాలానే ఉన్నారు. కానీ ఓ రెండు మూడు వారాల పాటు సినిమాలు లేక ఆలో లక్ష్మణా అనే పరిస్థితి వచ్చేసింది.

సినిమా థియేటర్లలో డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల పెత్తనాన్ని నిరసిస్తూ గత కొంత కాలంగా సౌత్ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు - ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యయం అంతకంతకు పెరుగుతూ ఆదాయం మాత్రం పడిపోతోందని ఆరోపిస్తునే ఉన్నారు. ఈ నేపధ్యంలోనే మార్చ్ 1 నుంచి థియేటర్లను నిరవధికంగా మూసేయబోతున్నట్టు నిర్మాతల సమాఖ్య గతంలోనే ప్రకటించింది. అక్కడి దాకా రాకుండా రాజీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు చివరి దఫా జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. సౌత్ నుంచి వచ్చిన నిర్మాతల ప్రతినిధులు - డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు అయిన యుఎఫ్ ఒ - క్యూబ్ సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. నిర్మాతల సూచనలకు ప్రొవైడర్ల స్పందించకపోవడంతో మీట్ ఫెయిల్ అయ్యింది.

దీంతో మార్చ్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు నిర్మాతల సమాఖ్య ప్రకటించింది. దీని ప్రకారం ఆ రోజు నుంచి ఏ సినిమా విడుదల ఉండకపోవడంతో పాటు అప్పటికే ప్రదర్శనలో ఉన్న సినిమాలను కూడా ఆపేస్తారు. మార్చ్ 2 నుంది తమ నుంచి క్యూబ్ - యుఎఫ్ ఒ లకు ఎటువంటి కంటెంట్ ఇవ్వమని తేల్చి చెప్పేసింది. మరి తదుపరి చర్చలు - ప్రతిపాదనలు ఎలా ఉండబోతున్నాయి అనేది మార్చ్ 2 తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే సినిమాల కలెక్షన్లు తగ్గి డీలగా ఉన్న బాక్స్ ఆఫీస్ పై ఈ సమ్మె ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. 
South-Indian-film-industry-vs-digital-service-providers--No-new-releases-From-March-2nd
Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...