‘మహానటి’పై జెమిని గణేశన్ ఏమన్నాడంటే..| Gemini Ganesan comments on "Mahanati movie"

Gemini Ganesan comments on "Mahanati movie"
పండిత పుత్ర పరమ శుంఠ అంటారు. అలాగే పులి కడుపున పులే పుడుతుందని అంటారు. దుల్కర్ సల్మాన్ రెండో కోవకే చెందుతాడు. ఇండియన్ సినిమాలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న మమ్ముట్టి ఘన వారసత్వాన్ని అందుకుని నటుడిగా అరంగేట్రం చేసిన దుల్కర్.. చాలా త్వరగానే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగని ఏ దశలోనూ తండ్రిని అనుకరించలేదు. ఆయన ఇమేజ్ ను వాడుకునే ప్రయత్నమూ చేయలేదు. తనకంటూ ఒక విభిన్న పంథా ఎంచుకుని నటుడిగా ఒక్కో మెట్టూ ఎక్కుతూ వెళ్తున్నాడు. కేవలం మలయాళంలోనే కాక వేరే భాషల్లోనూ అతను తనదైన ముద్ర వేస్తున్నాడు. తమిళంలో ‘ఓకే కణ్మణి’తో మెప్పించిన దుల్కర్.. ‘మహానటి’ సినిమాతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో జెమిని గణేశన్ పాత్రలో అతడి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే.

‘మహానటి’ లాంటి సినిమాతో తెలుగు తెరకు పరిచయం కావడం.. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం పట్ల దుల్కర్ కూడా  సంతోషం వ్యక్తం చేశాడు. మలయాళంలో పెద్ద పెద్ద సినిమాలు చేసిన దుల్కర్.. తన కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ మూవీ అని చెప్పడం విశేషం. చాలా పెద్ద బేనర్లో.. భారీ తారాగణంతో.. సెట్లతో.. ఇంకా అనేక భారీ హంగులతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని.. ఈ సినిమా కోసం స్పెయిన్ నుంచి కెమెరామన్ వచ్చాడని.. సినిమాను చాలా అందంగా తీర్చిదిద్దాడని దుల్కర్ అన్నాడు. ఇక జెమిని గణేశన్ పాత్ర కోసం తాను ప్రిపేరైన విధానం గురించి అతను చెబుతూ.. జెమిని గణేశన్ సినిమాలు చాలానే చూశానని.. ఆయన ద్వారా సావిత్రికి పుట్టిన పిల్లలతోనూ ఎంతో మాట్లాడానని చెప్పాడు. తనకు తెలిసి జెమిని జీవితంలో బాధలు లేవని.. ఆయన చాలా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాడని చెప్పాడు. రోజుకు 8 గంటల చొప్పున ఏడు రోజుల పాటు కష్టపడి ఈ చిత్రానికి తాను డబ్బింగ్ చెప్పినట్లు దుల్కర్ వెల్లడించాడు. ఈ పాత్రకు తాను డబ్బింగ్ చెప్పాలన్న నిర్ణయం దర్శకుడు అశ్విన్ దే అన్నాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...