'సైరా' కు జగన్ 'మెగా' ట్రీట్ ఇచ్చేసినట్టే!

Megastar-Chiranjeevi-meets-ap-cm-jagan-Andhra-Talkies
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్రీట్ నిజంగానే అదిరిందని చెప్పాలి. గడచిన వారం రోజులుగా జగన్ చిరుల భేటీపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. జగన్ వద్దకు చిరు వెళ్లడానికి గల కారణాలు తెలిసినా కూడా... ఇంకా ఏదో ఉందంటూ ఆసక్తికర కథనాలు వినిపించాయి. అయితే అటు జగన్ గానీ ఇటు చిరు గానీ ఈ కథనాలను ఎంతమాత్రం పట్టించుకోకుండానే... ముందుగా నిర్దేశించుకున్న షెడ్యూల్ కంటే కాస్తంత లేట్ అయినా కూడా కలిశారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. ఒకరినొకరు సన్మానించుకున్నారు. అంతేనా... అమరావతి పరిధిలోని తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మెగాస్టార్ కు జగన్ మరిచిపోలేని ట్రీట్ అయితే ఇచ్చేశారన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తనను కలిసేందుకు సతీసమేతంగా వచ్చిన చిరుకు తన సతీమణి వైఎస్ బారతితో కలిసి ఘన స్వాగతం పలికిన జగన్... మెగా దంపతులను తమ ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ తర్వాత జగన్ ను చిరు దుశ్సాలువాతో సత్కరించి బొకేను అందించగా... జగన్ కూడా అదే స్థాయిలో చిరుకు సత్కారం చేశారు. ఆ తర్వాత చాలా సేపు మాట్లాడుకున్న జగన్ - చిరు... జగన్ ఏర్పాటు చేసిన విందును ఇద్దరూ కలిసి స్వీకరించినట్లుగా సమాచారం. ఆ తర్వాత కూడా జగన్ - చిరులిద్దరూ చాలాసేపే మాట్లాడుకున్నా... వారి మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలేమిటన్న విషయం బయటకు రాకున్నా... తన తాజా చిత్రం సైరాను చూడాలని జగన్ ను చిరు కోరినట్టుగా సమాచారం. చిరు అభ్యర్థనకు జగన్ కూడా సానుకూలంగానే స్పందించినట్లుగా సమాచారం.ఆ తర్వాత చిరు దంపతులు అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా కాగా.. జగన్ దంపతులు వారిని ఘనంగా సత్కరించి జ్ఝాపికలు అందజేసి ఘనంగానే వీడ్కోలు పలికారు. చిరు దంపతులను సాగనంపే క్రమంలో ఇంటి బయటకు వచ్చిన జగన్ దంపతులు... చిరు దంపతులు కారులో ఎక్కి కూర్చున్నాక ఆ కారు కదిలేదాకా అక్కడే ఉండి వారికి వీడ్కోలు పలికారు. సాధారణంగా ఎంతో పెద్ద స్థాయి నేతలు వస్తేనే ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు ఇలా బయటకు రావడం మనకు తెలిసిందే. అయితే రాజకీయంగా అంతగా ప్రభావం చూపని చిరు ఓ సినిమా స్టార్ గా తన ఇంటికి వచ్చినా.. జగన్ ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటుగా ఘనంగానే వీడ్కోలు పలికిన తీరు నిజంగానే ఆసక్తికరంగా మారింది.

చిరు దంపతులు వెళ్లిపోగానే... ఈ భేటీ గురించి జగన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘చిరంజీవి గారు మనకు మరిన్ని స్మైల్స్ ను మరిన్ని మెమొరీస్ ను ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ జగన్ సదరు పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్ ను చూస్తుంటే... చిరు నటనపై జగన్ కు ఓ రేంజి అభిప్రాయముందనే చెప్పాలి. వంద చిత్రాల మార్కును దాటేసిన చిరు మరిన్ని చిత్రాల్లో నటించి మరిన్ని మెమొరీస్ ను అందించాలని జగన్ కోరుకున్నారంటే... నిజంగానే చిరుపై జగన్ కు ఓ రేంజిలో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నట్లే లెక్క. మొత్తంగా వారం పాటుగా తెలుగు ప్రజలను ఊరించిన భేటీలో చిరు దంపతులకు జగన్ మరిచిపోలేని ట్రీట్ ఇచ్చారని చెప్పక తప్పదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...