నిర్మాత అవతారమెత్తుతున్న టాలీవుడ్ హీరోలు

Heros-Becoming-tollywood-Producers-Andhra-Talkies
గతంలో హీరోలు వేరేగా నిర్మాతలు వేరేగా ఉండేవారు. అయితే ఎన్టీఆర్.. ఎఎన్నార్.. కృష్ణ లాంటి కొందరు పెద్ద స్టార్ హీరోలు నిర్మాణ రంగంలోకి ప్రవేశించి సూపర్ హిట్ సినిమాలతో తమ సత్తా చాటారు. మురళిమోహన్.. మోహన్ బాబు లాంటి సీనియర్లు కూడా చాలాకాలం నిర్మాతలుగా కొనసాగారు. ఈ జెనరేషన్లో నిర్మాతలుగా మారిన హీరోలు చాలామందే ఉన్నారు.

ఇప్పటికీ హీరోలుగా నటిస్తున్న సీనియర్ హీరోలలో చూసుకుంటే అక్కినేని నాగార్జున చాలా ఏళ్ళ నుంచి సినిమాలు నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన నాగార్జున ఇప్పటికీ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువమంది సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ల లో నాగ్ ఒకరు. 'మనం' లాంటి క్లాసిక్ ఫిలిమ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.  నందమూరి బాలకృష్ణ ఈమధ్యే నిర్మాతగా మారి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మించారు. అయితే ఆయనకు విజయం దక్కలేదు.ఈ జెనరేషన్ హీరోలలో చూసుకుంటే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై చాలానే సినిమాలు నిర్మించారు. అయితే కళ్యాణ్ రామ్ ఖాతాలో 'అతనొక్కడే'.. 'జై లవకుశ' లాంటి హిట్ సినిమాలతో పాటు 'ఓం 3D' 'కిక్-2' లాంటి డిజాస్టర్స్ కూడా ఉన్నాయి.  రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రెండు చిత్రాలను నిర్మించారు. అయితే మొదటి సినిమా 'ఖైది నెం. 150' విజయం సాధించినా రెండవ సినిమా 'సైరా' మాత్రం విజయానికి దూరంగా ఉండిపోయింది.

పవన్ కళ్యాణ్ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' బ్యానర్ పై  మహేష్ బాబు.. జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొన్ని సినిమాలకు నిర్మాణభాగస్వామిగా వ్యవహరించారు కానీ పూర్తి స్థాయిలో మాత్రం నిర్మాతగా మారలేదు.  మహేష్ ప్రస్తుతం అడివి శేష్ తో 'మేజర్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ సినిమా రిలీజ్ అయితే కానీ నిర్మాతగా మహేష్ గురించి చర్చించుకోలేం.

నాని తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా పై 'అ!' సినిమాను నిర్మించారు. మొదటి సినిమాతోనే విజయం సాధించడంతో పాటుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.  విజయ్ దేవరకొండ ఈమధ్యే కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మించారు. సినిమా ఇంకా థియేట్రికల్ రన్ పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడే హిట్టా ఫ్లాపా అన్నది డిసైడ్ చెయ్యలేం.  నాగశౌర్య.. కార్తికేయ లాంటి కొందరు హీరోలు స్వయంగా నిర్మాతగా మారకుండా కుటుంబ సభ్యుల నిర్మాణంలో హీరోలుగా నటిస్తున్నారు.

ఒకవైపు హీరోగా బిజీగా ఉంటూనే ఇలా నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకోవడం సాధారణ విషయమేమీ కాదు. పైన మనం మాట్లాడుకున్న వారిలో చాలామంది అలాంటి బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించడం గొప్ప విశేషమనే చెప్పుకోవాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...